
(విజయభారతి – ఆర్మూర్ న్యూస్ | జూలై 22)
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై తన అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, వాటిని కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపైనా అదే విధమైన విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయని పేర్కొన్నారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలతో కాలం వృథా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
