శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; హాస్టల్ కిటికీలో నుంచి దూకి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. హాస్టల్ యాజమాన్యానికి
తెలియకుండా స్నేహితులతో కలిసి బయటకు వెల్దామని కిటికీలో నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించి 5వ అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి (17) మాదాపూర్ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ వర్మ క్యాంపస్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రోజు రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉండడంతో కిటికీలో నుండి గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కిందికి దిగుతున్న శివకుమార్ రెడ్డి జారిపడిపోయాడు. ఇది గమనించిన మిగతా స్నేహితులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి వచ్చి హాస్టల్ వార్డెన్ కు విషయం తెలిపారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరిన హాస్టల్ వార్డెన్ విద్యార్థి శివకుమార్ రెడ్డిని లేపి చూడగా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారు దగ్గరలో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించగా శివకుమార్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నారాయణ కాలేజీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు.
