జిహెచ్ఎంసి అధికారుల ఫిర్యాదుతో నలుగురిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి లో నకిలీ జి ఓ నెంబర్ల 58, 59 పట్టాల బాగోతం బయట పడింది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన జీవో 58 59 పట్టాలు నకిలీ పత్రాలను సృష్టించి కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు. నకిలీ పట్టాల పత్రాలను ఆసరాగా తీసుకొని జిహెచ్ఎంసి లో భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకొని యదేచ్చగా నిర్మాణాలు నిర్మించారు. తాజాగా గచ్చిబౌలి సర్వే నెంబర్ 134, 135, 136 లో ఓ పార్కు స్థలం కబ్జాకు గురికావడంతో జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జీహెచ్ఏంసీ, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేయగా ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన జిహెచ్ఎంసి అధికారులు సదరు పట్టాల ధ్రువీకరణ కోసం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సదరుపట్టాలు రెవెన్యూ కార్యాలయం మంజూరు చేయలేదని అవి నకిలీ పట్టాలని తేల్చి చెప్పారు. దీంతో నకిలీ పట్టాలతో జిహెచ్ఎంసి భవన నిర్మాణ అనుమతులు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో శనివారం రోజు ఫిర్యాదు చేయగా. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి నకిలీ పట్టాలు తయారు చేసిన నలుగురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
