కుత్బుల్లాపూర్ మండలంలో అకస్మాత్ తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ మను చౌదరి
విజయ భారతి/ కుత్బుల్లాపూర్
కృషి, పట్టుదల, క్రమశిక్షణే మీ విజయానికి కారణమని, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇదే స్పూర్తితో చదువుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి, బౌరంపేట్ లోని పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏగ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరు నేరుగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ స్కూల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టరుకు బదులిస్తూ స్కూల్ లో స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎగుడుదిగుడుగా ఉన్న గ్రౌండును లెవల్ చేయించాలని అడిగారు. విద్యార్థులు అడిగిన అంశాలను తప్పకుండా పూర్తి చేస్తామని కలెక్టరు తెలిపారు. స్కూలుకు అవసరమైన అంశాలతో నివేదిక తయారు చేసి తనకు అందించాలని స్కూలు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. గతంలోనే అదనపు గదుల కొరకు నివేదిక పంపామని ప్రిన్సిపల్ తెలుపగా మళ్లీ నోటు పెట్టండి అవసరమైన వసతులను కల్పిస్తామని కలెక్టరు తెలిపారు.
