
విజయభారతి : నిజామాబాద్ న్యూస్
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తొలి విడతగా రూ.2,482 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడాన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.తొలి విడతలో దాదాపు 41 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని, రాబోయే కొద్ది రోజుల్లో మొత్తం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.ఇప్పటికే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇస్తోందని, నిధుల విడుదలతో అన్నదాతల్లో కొత్త ఉత్సాహం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు.
