
విజయభారతి, నందిపేట్ న్యూస్:
నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. గంగారాం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అబ్బి గంగారాం కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, గ్రామ ప్రజలకు అండగా నిలిచిన సామూహిక శక్తి అని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారే నిజమైన నాయకులని, అనాథలు, అభాగ్యులకు బాసటగా నిలిచిన గంగారాం సేవలు అభినందనీయమని అన్నారు.
రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆరోగ్య విషయంలో ధైర్యం కోల్పోవద్దని, ఏ అవసరం వచ్చినా తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవ, రాజకీయ కార్యకలాపాల్లో తమతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అబ్బి గంగారాం మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి పరామర్శ తనకు కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
