- దమ్ముంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలి..
- బిజెపి నాయకత్వానికి డబ్బులతో లోబర్చుకున్నారు..
- ఎమ్మెల్యే ఏ పోరాటంలో పాల్గొనలేదు, అండగా నిలవలేదు..
- హిందూ దీనోద్ధారకునిగా ఫోజులు పెట్టడం మానేయాలి..
- ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
- గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్..

విజయభారతి :ఆర్మూర్, జూలై 3:
టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించే స్థాయి లేదని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ చెప్పారు. ఆర్మూర్ లోని ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసు అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీ చేసే అవసరం లేదని సామాన్య కార్యకర్తను పోటీకి పెట్టి గెలిపిస్తామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ నుంచి అంచలంచేలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారని, ఇకముందు ఆయనను విమర్శిస్తే తగిన గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు. జిల్లా రైతాంగం కోసం సింగూర్ జలాలు కావాలని ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి జైలుకు వెళ్లిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ ఉందని వివరించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ పోరాటంతో పాటు ఏ రైతాంగ ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు. పోరాటాలకు మద్దతిచ్చి అండగా నిలిచిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. ఇలాంటి రాకేశ్ రెడ్డికి బిజెపి ఏ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చిందని ప్రశ్నించారు. అప్పట్లోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని డబ్బులతో లోబరుచుకొని రాకేష్ రెడ్డి బీఫామ్ తీసుకున్నారని ఆరోపించారు. శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీ ఒక రూపాయికి వైద్యం ఎటు పోయిందని ప్రశ్నించారు. గ్రామానికి 10 ఇల్లు నిర్మిస్తానని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని సవాల్ చేశారు. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లు వేసి గెలిపించారని వివరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి తప్ప ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. బిజెపిని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేని నిస్సహాయుడు రాకేశ్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల ఓపికను బలహీనతగా తీసుకోవద్దని హితవు చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించి రాజకీయాలలో వచ్చి ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు. హిందువుల గురించి గొప్పలు చెప్పే రాకేష్ రెడ్డి సంపాదించిన డబ్బును హిందూ సమాజానికి ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. హిందూ దినోద్దారకునిగా ఫోజులు పెట్టడం రాకేష్ రెడ్డి మానివేయాలన్నారు. గ్రామాలలో పర్యటిస్తే ఎమ్మెల్యేను నిలదీయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పిసిసి మాజీ కార్యదర్శి కాందేశ్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టం జీవన్, డిసిసి ప్రధాన కార్యదర్శి పస్క నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ఆలూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్, కౌన్సిలర్లు శాల ప్రసాద్, నర్మే నవీన్, గంగూలీ, గంగా ప్రసాద్, సిద్ధులు గుట్ట డైరెక్టర్ కొంత మురళి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
