Breaking News

ఆర్మూర్‌ లో మాటల యుద్ధం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు…

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ : జూలై 5

ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అయితే ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రాజకీయాలను నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఉద్దేశించి, గతంలో ఆర్మూర్ నియోజకవర్గానికి వారు ఏం చేశారంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ నాయకులు కూడా ప్రెస్‌మీట్ నిర్వహించి ఎమ్మెల్యేకు దీటుగా సమాధానం ఇచ్చారు.
అయితే ఈ వివాదం అక్కడితో ఆగకుండా, ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. బీజేపీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ సహకరించడం లేదని ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మాత్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని, అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మంచి పాలన, అభివృద్ధి కోసం ఓటు వేసి నాయకులను ఎన్నుకున్నారని, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల పరస్పర విమర్శలు, అసభ్య పదజాలం వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాయకులు వ్యక్తిగత విమర్శలు, బూతు పురాణాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి మాటల యుద్ధం కొనసాగితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ముదురుతున్న కవిత పార్టీ టిఆర్ఎస్ పేరు మార్చుకోక తప్పదా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *