Breaking News

రంగారెడ్డి కలెక్టర్ గా పాలమూరు రైతుబిడ్డ చింతకుంట నారాయణరెడ్డి

కష్టాల కడలి నుంచి కలెక్టర్‌ దాకా ఎదిగిన అతని లైఫ్ స్టైల్!

అవమానాల నుంచి ఉన్నత శిఖరాలకు..

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా ధైర్యంగా ముందుకు

పొలం పనులు చేసుకుంటూనే పాఠశాల చదువు

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూనే ఉన్నత చదువులు పూర్తి

2009లో గ్రూప్‌ -1 లో స్టేట్‌ నాలుగో ర్యాంకు

ప్రస్తుతం పలు జిల్లాల కలెక్టర్‌గా ప్రజలకు సేవ

ఐఏఎస్‌ చింతకుంట నారాయణరెడ్డి జీవితం

కలెక్టర్‌ కావాలనేది ఆ పిల్లాడి కల. కానీ.. ఆ కలలను కల్లలు చేసే అవరోధాలు అడుగడుగునా ఎదురయ్యాయి. కుటుంబానికి పెద్దదిక్కైన నాన్న భౌతికంగా దూరమయ్యాడు. అయినా మొక్కవోని ధైర్యంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని ఐఏఎస్ కాడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగారు

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

హైదరాబాద్‌ విజయ భారతి న్యూస్ ; కలెక్టర్‌ కావాలనేది ఆ పిల్లాడి కల. కానీ.. ఆ కలలను కల్లలు చేసే అవరోధాలు అడుగడుగునా ఎదురయ్యాయి. కుటుంబానికి పెద్దదిక్కైన నాన్న భౌతికంగా దూరమయ్యాడు. కలెక్టర్‌ సంగతేమో కానీ, కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడింది. అయినా ఆ పిల్లాడు లక్ష్యాన్ని వదల్లేదు. ఆ కలను మదిలోనుంచి చెరిపేయలేదు. బిగించిన పిడికిలిలా దృఢ సంకల్పంతో దాన్ని నెరవేర్చుకునేందుకే సిద్ధమయ్యాడు. కష్టాలను ఎదుర్కొని లక్ష్యసాధనలో అడుగులు వేశాడు. పొలం పనులు చేసుకుంటూనే బడికెళ్లాడు. పెట్రోల్‌ బంకులో పనిచేస్తూనే కాలేజీలో చదువుకున్నాడు కష్టలనే మెట్లుగా మలుచుకున్నాడు. చివరకు 2009లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి నాలుగో ర్యాంకును సాధించాడు. ఆయనే.. ఐఏఎస్‌ అధికారి చింతకుంట నారాయణరెడ్డి. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సేవలందించనున్నారు.‘ఒక కలను నిజం చేసుకునే ప్రయాణంలో సమస్యలెన్నో అడ్డుపడొచ్చు. ఆ దారిలో ముళ్లెన్నో గుచ్చుకోవచ్చు. ఆ ప్రయత్నంలో అవమానాలెన్నో ఎదురుకావచ్చు… కానీ చివరికి సాధించే విజయం వాటన్నింటినీ చెరిపేస్తుంది’ అంటున్న నారాయణరెడ్డి జీవితం గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారందరికీ ఆదర్శం.కష్టాల కడలిలో నుంచి ఉన్నతశిఖరాల వరకు సాగిన తన ప్రయాణం గురించి ఆదాబ్ అందిస్తున్న కొన్ని విషయాలు ..

చదువుకుంటూ పొలంబాట

తనది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే చిన్న పల్లె. అమ్మానాన్న చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ. వాళ్లకు ఇతను ఆరో సంతానం. నలుగురు అన్నలు, ఓ అక. వారిది పూర్తిగా వ్యవసాయ కుటుంబమే అయినా.. ఉన్నది కొద్దిపాటి పొలమే. తన నాన్నతోపాటు అన్నయ్యలు కూడా వ్యవసాయమే చేసేవారు. దానిపై కుటుంబం వెళ్లదీయమే కష్టం. అట్లాంటిది.. ఇక చదువు చెప్పించడం ఎలా సాధ్యం? చిన్నవాడు కాబట్టి తనంటే అందరికీ ఇష్టం. అయితే.. ఏడోతరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఒక్కసారిగా జీవితం ఆగిపోయినంత పనైపోయింది. చుట్టూ చీకటి. చదువు అపేద్దామని నిర్ణయించుకున్నారు. అందరూ పొలంబాట పట్టారు ఆ తర్వాత అంతా కష్టాల పయనమే!

ఎగతాళి చేశారు.. ఎక్కిరించారు…

కష్టాలెన్ని ఎదురైనా ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదుతను. ఫలితంగా డీఎస్సీలో మహబూబ్‌నగర్‌ జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే.. 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైంది. ఫలితంగా.. మళ్లీ ఉద్యోగ వేట మొదలైంది. మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నెలకు రూ.2,500 ఇచ్చేవారు. పెద్ద చదువు చదివి ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నావని అందరూ అడిగేవారు. కొందరైతే.. ‘నువ్వెంత చదివితే ఏంటి? చివరికి ఇదే నీ జీవితం’ అంటూ ఎగతాళి చేసేవారట కానీ తనెప్పుడూ వారి మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. ఆ క్షణం నవ్వుకుని వదిలేసేవాడనియంటారు.2008లో డీఎస్సీ పోస్టింగ్‌ ఇచ్చారు. తను చదివిన కల్వాల్‌ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది.

తొలి ప్రయత్నం.. సబ్‌ కలెక్టర్‌ గా ఉద్యోగం…

టీచర్‌ ఉద్యోగం వచ్చినా జీవితంలో ఇంకా ఏదో అసంతృప్తి అలాగే ఉంది. తెలియని వెలితి రాత్రివేళల్లో నిద్రపోనిచ్చేది కాదు. సొంత ఊరే అయినా.. ఓ చిన్న రూమ్‌ అద్దెకు తీసుకుని ప్రిపరేషన్‌ ప్రారంభించాను. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడం.. ఇదే జీవితం. కుటుంబం లేదు. స్నేహితుల్లేరు. ఫంక్షన్లు లేవు. సరదాలు లేవు. ఒకటే లక్ష్యం-చదువు. శ్రమ ఫలించింది. 2009లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌-1లో స్టేట్‌ నాలుగో ర్యాంకు సాధించారు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఉద్యోగం వచ్చింది 2011లో గద్వాల, 2011లో పెద్దపల్లి, సూర్యాపేటల్లో , రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన తండ్రి చనిపోయినప్పుడే తను చదువును వదిలేసి ఉంటే.. కష్టాలు ఎదురైనప్పుడు నిరాశపడి ఉంటే.. కలెక్టర్ని అయ్యేవాడే కాదు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికోసం అహర్నిశలు శ్రమించాలి. స్వేచ్ఛగా కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి అంటారు ఆయన యువతని ఉద్దేశించి.

పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ చదువులు

చదువు మానేస్తానంటే అన్నయ్యలు ససేమిరా అన్నారు. మేం చూసుకుంటాం.. నువ్వు చదువుకో..అని ప్రోత్సహించడంతో ముందుకు కదిలాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల ముందు అన్నల ప్రోత్సాహం నిలబడలేకపోయింది. ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవాడని. పదో తరగతి పూర్తయ్యాక ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఫిక్స్‌ అయ్యారట. అదే సమయంలో హైదరాబాద్‌ వెళ్లి ఓ పెట్రోల్‌ బంకులో పనికి కుదిరారని. అయితే.. పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో. కాలేజీ వాళ్లు ఉచితంగా చదువు చెప్పేందుకు ముందుకొచ్చారు. దాంతో ఇంటర్‌లో చేరి ఇంటర్ చదవడం ప్రారంభించారు. అయినా మళ్లీ అవే కష్టాలు అతన్ని చుట్టుముట్టాయని దీంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొంతకాలం పెయింటర్‌గానూ బొమ్మలు వేసే పనిచేసిన సందర్భాలు ఆయన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయిన ప్రతీసారి చదువే తనకో మార్గం చూపిస్తూ వచ్చిందని, మళ్లీ ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరారట. ఆ తర్వాత ఉస్మానియాలో బీఈడీ పూర్తిచేశారని. ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్‌) కూడా చేశారట ఇది రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి గారి మనోగతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *