ప్రకటించారు….! పదవిని ఇవ్వడం విస్మరించారు?
-తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ కుటుంబాన్ని అగౌరవపరిచిన ప్రభుత్వం
-శ్వేత ఐలమ్మకు మహిళ కమిషన్ సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించాలి
-గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు రాచమల్ల ఎల్లేష్
గజ్వేల్ 29 జూలై 2025 విజయభారతి న్యూస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడమే కాకుండా వారిని సమాజంలో అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తుందని గజ్వేల్ నియోజకవర్గం రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం సాయుధ పోరాటం జరిపి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన చాకలి ఐలమ్మ ను కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరపరిచిందని విమర్శించారు. గత పది నెలల క్రితం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి కళామందిరం వేదిక సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ ముని మనవరాలు శ్వేత ఐలమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలుగా పదవిని ఇస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. అయితే పదవిని ప్రకటించి 10 నెలలు గడుస్తున్నప్పటికీ దానికి సంబంధించిన జీవోను ఇవ్వడం విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి సత్కరించుకుంటామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘ రేవు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన ‘ విధంగా ఉందని మండిపడ్డారు. కాగా రజక జాతి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే ఇప్పటివరకు రజకులకు అమలు చేసిన పథకాలు ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అవగతమవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్వేత ఐలమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలుగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించి రజకుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు.