బండారు శ్రీనివాసులు, డిటియు వనపర్తి జిల్లా కన్వీనర్
పానగల్ సెప్టెంబర్ 23: విజయభారతి డైలీ : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మ టీచర్స్ యూనియన్ ముందుగా కృషి చేస్తోందని డిటియు వనపర్తి జిల్లా కన్వీనర్ బండారు శ్రీనివాసులు తెలిపారు. ఆయన పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సమావేశంలో నూతనంగా ఏర్పాటైన ధర్మ టీచర్స్ యూనియన్ ను ఉపాధ్యాయులకు పరిచయం చేస్తూ, కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, “తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జనవరి 3న భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా నిజాంబాద్ జిల్లాలో శిలాఫలకం ఆవిష్కరణ జరుగుతుంది. జనవరి 7న ఉస్మానియా, కాకతీయ, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల సమక్షంలో ధర్మ టీచర్స్ యూనియన్ ప్రారంభమవుతుంది” అని పేర్కొన్నారు.
ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పాక లింగమల్లు యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల ప్రత్యేక హక్కుల రక్షణ, సేవా సంబంధిత హక్కుల సాధన కోసం ఈ సంఘం కృషి చేస్తుందని బండారు శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో డిటియు బాధ్యులు ఆది వెంకట్, భీముడు తదితరులు పాల్గొన్నారు.