
విజయభారతి : హైదరాబాద్ న్యూస్: జులై :5
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం అంటే ప్రభుత్వానికి భయమా, ప్రేమా లేక రెండూ ఉన్నాయా అని ప్రశ్నించారు. హైడ్రా చర్యల పేరుతో పేదల ఇళ్లు, జీవనోపాధులపై దెబ్బ కొడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.భూములు, రియల్ ఎస్టేట్ కమిషన్ల కక్కుర్తితోనే హైడ్రా చర్యలు సాగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. సామాన్యులపై మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, మజ్లిస్ నేతలకు సంబంధించిన ఆస్తులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి, ఫాతిమా విద్యాసంస్థల అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసిపోయాయని ఆరోపించారు.హైడ్రా కూల్చివేతల కారణంగా పేద ముస్లిం కుటుంబాలు కూడా ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్న సమయంలో ఎంఐఎం గానీ, కాంగ్రెస్ గానీ వారి తరఫున నిలబడలేదని, కనీసం నిరసన కూడా తెలపలేదని విమర్శించారు.అయితే ఎంఐఎంకు సంబంధించిన ఆస్తుల అంశం వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసికట్టుగా నిలబడుతున్నాయని ఆరోపించారు. దీన్ని బట్టి ముస్లిం సమాజంపై ప్రేమ కంటే రాజకీయ ప్రయోజనాలకే ఈ రెండు పార్టీల ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.ఫాతిమా విద్యాసంస్థల ఎపిసోడ్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఎంఐఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పేదవాడి ఇంటిపై బుల్డోజర్లు నడిపిస్తూ, కాంగ్రెస్–మజ్లిస్ రాజకీయ కూటమికి మాత్రం రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రాధాన్యతలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, సహజ వనరులు తెలంగాణ ప్రజల సొత్తేనని, రాజకీయ రక్షణలో ఉన్న కొందరి సొత్తు కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఓటు బ్యాంకు, మతపరమైన కోణంలో పాలన సాగించడం మానుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ రాజకీయ మిత్రులను వెనకేసుకురావడం ఆపాలని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి “ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే న్యాయం” అమలు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
