
విజయభారతి : నిజామాబాద్ న్యూస్
తెలంగాణప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ (ఇందిరమ్మ మహిళా శక్తి) పథకం కింద నిజామాబాద్ జిల్లాలో అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం లో నగర డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొనడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి మాజీ ఎమ్మెల్సీఆకుల లలిత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ₹1.02 కోట్ల వ్యయంతో 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుండగా, అందులో కేవలం నిజామాబాద్ అర్బన్ (పట్టణ) నియోజకవర్గానికి 500 కుట్టు మిషన్లను కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అందించారన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మైనారిటీ మరియు నిరుపేద మహిళలు కుట్టుపని ద్వారా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని చేపట్టిందని తెలిపారు. దీని నిర్వహణను నిజామాబాద్‌లోని ఎన్ఏసీ (ఎన్ ఎ సి) సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఈ మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ పొందాలనుకునే మహిళలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులు 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు.
కుట్టుపనిలో శిక్షణ పొందిన సర్టిఫికేట్ (ట్రైనింగ్ సర్టిఫికేట్) తప్పనిసరి.
వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షల కంటే తక్కువ ఉన్నవారే అర్హులని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోజన్న, కరీం, కోఆప్షన్ సభ్యలు నరేంధర్ సింగ్, ఖైసర్, అంతరెడ్డి విజయపాల్ తదితరులు పాల్గొన్నారు.
