
విజయభారతి : హైదరాబాద్ న్యూస్
న్యూఢిల్లీ: తెలంగాణలో మెట్రో రైలు ప్రాజెక్టుల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ముందుకు సాగితే భారీ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రజలపై ప్రయాణ చార్జీల భారం పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రుణాలు తీసుకుంటే 10 నుంచి 12 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అదే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణాలు సమీకరిస్తే 2 నుంచి 4 శాతం వడ్డీకే నిధులు లభించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో దాదాపు 8 శాతం వరకు వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.54 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సి రావచ్చని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సమన్వయంగా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తే ఎస్ఆర్బీఎం పరిమితులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా నిధుల సమీకరణకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి, నగర రవాణా వ్యవస్థ బలోపేతం దృష్ట్యా మెట్రో విస్తరణ ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్రం కలిసి పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెట్రో ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

