జ్వరం 3 రోజులు ఉంటే పి హెచ్ సి కి వెళ్లాల్సిందే
స్వీయ వైద్యం వద్దు: డిఎంహెచ్వో

విజయభారతి ;సూర్యాపేట జులై 8;
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటరమణ సూచించారు.జ్వరం, జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. తప్పనిసరిగా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పి హెచ్ సి) సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.స్వీయ చికిత్సకు పాల్పడకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధులు తీవ్రం కాకుండా నివారించవచ్చని అన్నారు.నిల్వ నీరు వద్దు – దోమలకు అవకాశం ఇవ్వొద్దుసీజనల్ వ్యాధుల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిఎంహెచ్వో పేర్కొన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితులను పూర్తిగా నివారించాలని సూచించారు. నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఇళ్లలో ఉపయోగించకుండా ఉన్న పాత టైర్లు, పాత ఎయిర్ కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, డబ్బాలు, బకెట్లు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా తరచూ పరిశీలించి శుభ్రం చేయాలన్నారు. ఇంటి నీటి ట్యాంకులను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతో పాటు మూతలు వేసి ఉంచాలని తెలిపారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిఎంహెచ్వో పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు, స్థానిక సంస్థలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు.జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పి లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లేదా సమీప పి హెచ్ సి ను సంప్రదించి వైద్య సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
