Breaking News

జిల్లాలో తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు… -కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి..

విజయభారతి : న్యూస్ నిజామాబాద్ జూలై 14 :

ఎక్కడ కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 5వేల జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగు, సాగునీటి అవసరాలకు అవి ఏమేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవరసం ఉందన్నారు. ప్రత్యేకించి తాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా, భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే, బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు, ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసిపడుతూ, భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవకాశం ఉన్న చోట ఫాంపాండ్స్, ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట, నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రాధాన్యత క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా తాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల సాగుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి, రెండు తడులు నీటిని అందించేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి ప్రకాశ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

పెర్కిట్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో సామాజిక తనిఖీ…. నిర్వహణ పాఠశాల రికార్డులు, మౌలిక వసతులు పై ….. విద్యార్థులకు అందుతున్న సేవలపై జిల్లా విద్యాశాఖ అధికారిణి హరిణి సమగ్ర పరిశీలన….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *