Breaking News

పార్కు కబ్జాకు అధికారులే వత్తాసు

  • అనుమతులు రద్దయినా ఆగని నిర్మాణం
  • మదీనాగుడాలో టౌన్ ప్లానింగ్ వైఫల్యంపై ఆరోపణలు

మియాపూర్, విజయభారతి:

మదీనాగుడా డివిజన్‌లో ప్రభుత్వ పార్కు స్థలాన్ని ఆక్రమించి బహుళ అంతస్తుల వాణిజ్య భవన నిర్మాణం కొనసాగుతున్నా, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిర్మాణ అనుమతులను అధికారికంగా రద్దు చేసినప్పటికీ పనులు యథావిధిగా సాగుతుండటంతో అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంజీరా పైప్‌లైన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 23లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలమే ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా మారింది. స్థానికుల ఆరోపణల ప్రకారం అసలు రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్‌ను ఇతర సర్వే నంబర్లుగా చూపిస్తూ రికార్డుల్లో మార్పులు చేసి, అదే స్థలంలో భారీ వాణిజ్య భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఊపిరితిత్తుల్లా ఉండాల్సిన పార్కు స్థలం కాంక్రీట్ నిర్మాణంగా మారుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలోనే స్పందించారు. E/403006 రద్దు ఉత్తర్వుల ద్వారా భవన నిర్మాణ అనుమతులను అధికారికంగా రద్దు చేశారు. అయితే ఆ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేసినా, మరుసటి రోజే నిర్మాణ పనులు మళ్లీ కొనసాగుతున్నాయని చెబుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో చట్టాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై వరుస ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప, నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసేలా కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్‌ విజిట్‌లు నిర్వహించడం, ఫొటోలు తీసుకోవడం, నోటీసులు జారీ చేయడం వరకే పరిమితమవుతున్నారని, అనంతరం ఎలాంటి అమలు చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ ఓనర్

ఈ వ్యవహారంలో చైన్‌మెన్‌లు, మధ్యవర్తుల పాత్ర కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిల్డర్‌ల నుంచి అధికారుల వరకు జరిగే లావాదేవీలను మధ్యవర్తులే సమన్వయం చేస్తున్నారని, అందువల్లే అనుమతులు రద్దయినా నిర్మాణాలు ఆగడం లేదని అంటున్నారు. చైన్‌మెన్‌లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసినా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదని, వ్యక్తులు మారుతున్నా వ్యవస్థలో మార్పు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.

పార్కు స్థలాలు ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రజా ఆస్తులని, వాటిలో పిల్లలకు ఆటస్థలాలు, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలాంటి స్థలాల్లో వాణిజ్య భవనాలు నిర్మించబడితే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ప్రభుత్వ పార్కు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పత్రాలతో తదుపరి కథనాన్ని వెలుగులోకి విజయ భారతి తీసుకొస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *