డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కొరడా
ఏడుగురికి రూ.70 వేల జరిమానా..
ఇద్దరికి ఐదు రోజుల జైలు శిక్ష….
(విజయభారతి): కమ్మర్ పల్లి న్యూస్: ఆగస్టు 12
కమ్మర్‌పల్లి: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని కమ్మర్‌పల్లి పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఏడుగురు వాహనదారులను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి విచారణ అనంతరం వారికి శిక్షలు విధించారు.ఏడుగురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు. వీరిలో ఇద్దరికి జరిమానాతో పాటు చెరో ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి ఎస్సై సిహెచ్. సతీష్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రోడ్డుపైప్రయాణించే నిరాపరాధుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించిన సమయంలో వాహనాలు నడపకుండా సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎస్సై సతీష్ కోరారు.
